సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) జైలులో అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది ఆయనను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని చెప్పినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఛాతిలో నొప్పి ఉందని చెప్పగానే రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లామని.. అనంతరం కడప రిమ్స్‌కు కూడా తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించామన్నారు. అయితే పోసాని ఆరోగ్యం బాగానే ఉందని.. ఆయన అనారోగ్యం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించామని వెల్లడించారు.
కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. సోమవారం ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.