ప్రజాస్వామ్యంలో చట్టసభలు అత్యున్నత వేదికలు అని, వాటిని ప్రజా సమస్యలు తెలిపేందుకు, సరైన పరిష్కారం కోసం వినియోగించాలని మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh)వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా విమర్శించారు.
శనివారం రాజమహేంద్రవరంలోని తన జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత ప్రతిపక్షహోదాపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ వైసీపీ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సంఖ్యా బలం తక్కువ ఉందని తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడం హాస్యాస్పదం అన్నారు. గతంలో ఇదే జగన్ మోహన్ రెడ్డి 5 సీట్లు లాక్కుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని విమర్శించిన మాటలను గుర్తుచేశారు.
ప్రజల సమస్యలను గాలికొదిలేసే విధానాన్ని జగన్ అవలంభిస్తున్నారని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యా బలం లేకపోతే ప్రతిపక్ష హోదా రాదని తెలిసినప్పటికీ శాసనసభకు రాకూడదన్న ఉద్దేశంతో ప్రతిపక్ష హోదాను సాకుగా చూపించి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని ఉంటే, గళమెత్తి ప్రశ్నించాలని ఉంటే సభకు రావాలని సూచించారు. శాసన సభ్యుడిగా చట్టసభల్లో మాట్లాడితే రికార్డ్ అవుతుందని తద్వారా ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉపకరిస్తుందన్నారు.
ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన ఉంటే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై గళమెత్తి మాట్లాడి పరిష్కరించడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత పని అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ హితవు పలికారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, ఛాంబర్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, వెనకాల గన్ మెన్ లు ఉంటే అసెంబ్లీకి వస్తాను అనడం సరికాదని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు.