కూటమి ప్రభుత్వంలో మరో ఐపీఎస్ అధికారిపై వేటు పడింది. సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (Sunil kumar)పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అలాగే ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. ఆలిండియా సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా 2020 నుంచి 2024 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఆరోపణలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రఘురామకృష్ణ రాజు(Raghuramakrishnam raju) కస్టోడియల్ టార్చర్ కేసులో డీఐజీ సునీల్ నాయక్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణం రాజును సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ అక్కడికి వచ్చారని ధృవీకరించారు. దీంతో ఆయనను విచారించాలని ఈ కేసు విచారణాధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ డిసైడ్ అయ్యారు. గత ప్రభుత్వం హయాంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ డీఐజీగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిహార్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం బిహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.