ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) నియమితులైనట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లకు ఇలాంటి పదవి ఎలా ఇస్తారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.
“ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి” అని హెచ్చరించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే మీనాక్షి చౌదరి ఇటీవల వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. గుంటూరుకారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్ సినిమాలతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను తన అందచందాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.