బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పాలమూరు ద్రోహి అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. వనపర్తిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణానది జలాలు ఏపీ కొల్లగొడుతుంది అంటే దానికి కారణం కేసీఆర్ అన్నారు. పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదని ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. పదేళ్ళు SLBC పనులు చేయకపోవడం వల్లే 8 మంది ప్రాణాలు పోయాయని.. ఈ పాపం కేసీఆర్ అండ్ కో నేతలది కాదా అని ప్రశ్నించారు.
పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారని తాము అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దిగిపోవాలని హుకుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని.. తమతో పెట్టుకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా కిషన్ రెడ్డి(Kishan Reddy) బీజేపీ ఖాతాలో వేసుకుంటున్నారని తెలిపారు. మరి మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం లేదని, మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సాగు నీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఎందుకు జరపడం లేదని నిలదీశారు.
కేంద్రానికి ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే కేంద్రమంత్రలుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్(Bandi Sanjay) ఇద్దరూ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతులు వచ్చేలా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.