రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. దేశానికి వెన్నెముక రైతులు అనే సామెత మాటలకే పరిమితమవుతుంది. ప్రస్తుతం పండించిన పంటలకు ఆశించిన ధర రాక అన్నదాతలు కంట కన్నీరు పెడుతున్నారు. పచ్చ బంగారంగా పిలిచే పసుపు రైతులు(Turmeric Farmers) ఆశించిన ధర లేక కుదేలవుతున్నాడు. ఆరు గాలం శ్రమించి పంట చేతికొచ్చాక మార్కెట్లో గిట్టుబాటు ధర అందక లబోదిబోమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు(Turmeric Board) వచ్చిందనే సంతోషం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ధర రెట్టింపు అవుతుందని ఆశపడిన రైతన్న పెట్టిన పెట్టుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నాడు. పసుపు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతుంది.
గతేడాది రూ.18 వేల వరకు పలికిన ధర ఇప్పుడు రూ.10వేలు కూడా దాటకపోవడంతో అల్లాడిపోతున్నాడు. ఆశించిన స్థాయిలో ధర లేక పసుపు పంట పైన విరక్తి చెందుతున్నాడు. పూర్తిస్థాయిలో ధర లేకపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదని వాపోతున్నాడు. దీంతో పసుపు పంట కన్నా ఇతర పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మల్లాపూర్ మండల వ్యాప్తంగా 2,328 ఎకరాల్లో పసుపు పంట సాగు చేశారు. పేరుకేమో నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు మద్దతు ధరను కల్పించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారు. దీంతో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా రైతుల పరిస్థితి మారింది. గిట్టుబాటు ధర కల్పిస్తే కానీ పంట వేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.

పసుపు పంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. పసుపు బోర్డు వచ్చిందని సంతోషంలో ధర రెట్టింపు అవుతుందని అనుకున్నాం. కానీ రేటు గత ఏడాది కన్న సగం పడిపోపోతుంది. రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది.
కాటిపల్లి.వినోద్
యువ రైతు

మూడెకరాలలో పసుపు పంట సాగు చేసినా, పంట బాగా వచ్చింది. బోర్డు వచ్చిందని రేటు రూ.15వేల పైన ఉంటుందని సంబురపడ్డాం. కానీ పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రైతులను అడులో ఆదుకోవాలి
బద్దం.శ్రీనివాస్ రెడ్డి
రైతు
