కూటమి ప్రభుత్వంలో వైసీపీ కీలక నేతల మెడకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది అరెస్టై జైలుకు వెళ్లగా.. మరికొంతమంది కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajani)పై ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి కావడంతో ఆమెపై విచారణకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు గవర్నర్‌కు లేఖ రాశారు. రెండు రోజుల్లో అనుమతి లభించే అవకాశముందని తెలుస్తోంది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేసు నమోదు చేయనున్నారు. దీంతో అమెను విచారించడంతో పాటు అవసరమైతే అరెస్ట్ కూడా చేసే అవకాలున్నాయిన సమాచారం. మరోవైపు ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను కూడా విచారించేందుకు సీఎస్ అనుమతిని ఏసీబీ తీసుకుంది.
కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి.. అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని విడదల రజనీ, పల్లె జాషువాపై అభియోగాలు ఉన్నాయి. రూ.5 కోట్లు డిమాండ్ చేసి. రూ.2.20 కోట్లు వసూలు చేశారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పష్టం చేసింది. ఇందులో రజినికి రూ.2 కోట్లు, జాషువాకు రూ.10 లక్షలు, రజిని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.