ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) శుభవార్త అందించారు. ఈనెలలో 16,347 పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే 70 శాతం టీచర్ పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే టెట్(TET) పరీక్ష నిర్వహించామన్నారు.
అంతకుముందు కూడా తనను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలోనూ లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఇచ్చే కిట్లపై నేతల ఫొటోలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. ఆదర్శ పాఠశాలలతో పాటు ఇతర ఉన్నత పాఠశాలలు విద్యార్థులకు ఇంటి నుంచి చాలా దూరం ఉంటున్నాయో వారికి రవాణా భత్యం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.