మహారాష్ట్ర(Maharashtra)లోని మహాయుతి కూటమిలో లుకలుకలు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే శివసేన షిండే వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో అంటీముట్టనట్లుగా ఉన్నారని తెలుస్తోంది. మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. తాజాగా ఓ సర్పంచ్ హత్య కేసుకు బాధ్యత వహిస్తూ మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.
ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్‌లో మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్(45) గతేడాదతి డిసెంబర్ 9న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఫిబ్రవరి 27న పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఇందులో ధనంజయ్ సన్నిహితుడి పేరు ఉండటంతో పాటు మంత్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ముండేను రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. దాంతో ధనంజయ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఫడ్నవిస్ వెంటనే ఆమోదించి గవర్నర్ రాధాకృష్ణన్‌కు పంపించారు.
కాగా బీడ్ పార్లి నియోజకవర్గం నుంచి ధనంజయ్ ముండే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ విడిపోయినప్పుడు ఆయన అజిత్ పవార్ పక్షాన చేరారు. గతంలో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు.