వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) భద్రతపై కొంతకాలంగా ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కుట్రపూర్వకంగానే జగన్‌కు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ ఏకంగా కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారు. తాజాగా అసెంబ్లీలో ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పందించారు. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంటే ఎక్కువ భద్రతను జగన్‌కు కల్పిస్తున్నామని చెప్పారు. జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పిస్తున్నామని తెలిపారు. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్ష హోదా విషయంలో స్పీకర్‌పై అసత్య కథనాలు ప్రచురించడంపై ఆయన మండిపడ్డారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని ప్రజాప్రతినిధులుగా ప్రజల తరపున పోరాడాల్సి ఉందన్నారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. అప్పట్లో చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారని.. ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదు అని సభ సాక్షిగా జగన్ వ్యాఖ్యానించిన సంగతి గుర్తు చేశారు. పార్లమెంటులోని 121సి నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెం.లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.