ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదని పవన్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లి పార్టీ పెట్టుకోవాలంటూ సూచించారు. తాజాగా పవన్ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ సెటైర్లు వేశారు. ఆయన జీవితంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారని వ్యాఖ్యానించారు.
మరోవైపు మీడియా సమావేశంలో ప్రతిపక్ష హోదాపై జగన్ మరోసారి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే ఉన్నా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష పార్టీగా హోదా లాగేస్తానంటే తాను వద్దన్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను చెప్పేందుకు మాత్రమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నా అని జగన్ వెల్లడించారు.