మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(Vivekanandha Reddy) హత్య కేసు(Murder case)లో ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న(Watchmen Raganna) మృతి చెందారు. ఈయన గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా రంగన్న శ్వాస కోస వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రంగన్న ఆరోగ్యం మరింత క్షీణించటంతో ఆయన కుటుంబ సభ్యులు పులివెందుల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న మృతికి సంబంధించిన సమాచారాన్ని డీఎస్పీ సీబీఐ రాష్ట పోలీసులకు తెలియపరచనున్నారు. ఇప్పటికే రంగన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా రంగన్న ఆస్తమాతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు నలుగురు నిందితులను చూశానని సీబీఐకి రంగన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద రంగన్న వాంగ్మూలం కూడా ఇచ్చారు. రంగన్నను కాపాడుకోవడానికి సీబీఐ ప్రత్యేకంగా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని కూడా కల్పించారు.
ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న మృతి చెందటంతో కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సిందేనని పలువురు వాపోతున్నారు.