పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వివాహం చేసుకోవడానికి, అంటే ఒకే జండర్ మధ్య వివాహం జరగడానికి సంబంధించిన అంశాన్ని పరిశీలించి, చట్టబద్ధత కల్పించడానికి వీలుగా దీన్ని సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించడం నిజంగా హర్షణీయ విషయం. ఇది లింగ వివక్షను చాలావరకు తగ్గిస్తుందనడంలో సందేహం లేదు. నిజానికి ఇది చట్టసభకు సంబంధించిన వ్యవహారం. అయినప్పటికీ సుప్రీంకోర్టు దీనిని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించి మంచే చేసింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో ఇచ్చిన తీర్పునకు ఇది ఒక విధంగా కొనసాగింపు, ఈ చరిత్రాత్మక తీర్పు తర్వాత ఇది సహజ పరిణామమేనని స్వలింగుల మధ్య వివాహంపై పిటిషన్ దాఖలు చేసినవారు కోర్టు దృష్టికి తెచ్చారు.అయితే, ప్రభుత్వం మాత్రం, ఇప్పటికే భిన్న జండర్‌ల మధ్య జరుగుతున్న వివాహాల నుంచి దారి మళ్లాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఒక వేళ దీన్ని మార్చాలన్న పక్షంలో ఆ అధికారం శాసన వ్యవస్థకే ఉంటుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా, సుప్రీంకోర్టు ముందున్న ప్రశ్నేమిటంటే, దేశంలో అమలులో ఉన్న వివాహ చట్టాలను, ముఖ్యంగా స్వలింగుల మధ్య జరిగే వివాహాలకు సంబంధించిన ప్రత్యేక వివాహ చట్టా (1954)న్ని ఏ విధంగా నిర్వఛించాలి, దీనికి ఏ విధంగా భాష్యం చెప్పాలి అన్నదే. ‘ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా’ అని చట్టం చెబుతోంది. అయితే, ఇదే చట్టం కింద వివాహం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు స్వలింగులు అయిన పక్షంలో వారి వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ చేయడానికి చట్టపరంగానే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒకే జండర్‌కు చెందిన వ్యక్తు మధ్య పరస్పర అంగీకారంతో వివాహం జరగడానికి అనుమతినివ్వడం స్వలింగ సంపర్కుల మీద ఉన్న మచ్చను, అపప్రథను చెరిపేసిందని ప్రభుత్వం స్పష్టం చేసింది కానీ, అంతమాత్రాన అది వారి మధ్య వివాహానికి అంగీకారం తెలిపినట్టు కాదని వాదించింది. విభిన్న జండర్‌ల మధ్య వివాహం జరగడం అనేది చట్టబద్ధ విషయమా కాదా అన్నది తేల్చాల్సింది, వివాహాల పరిధిని నిర్ణయించాల్సింది చట్టసభలేనని కూడా అది పేర్కొంది. ఒకే జండర్‌కు చెందినవారిని వివాహానికి దూరంగా ఉంచినంత మాత్రాన దాన్ని లింగ వివక్షగా పరిగణించకూడదని కూడాఅది తేల్చి చెప్పింది.
ఇక సమానత్వం విషయానికి వస్తే, ఒక ప్రధాన ప్రశ్న ఉదయించడం సహజం. స్వలింగ సంపర్కుల మధ్య వివాహం జరిగితే వారికి కూడా భిన్న జాతి లేదా సహజ వివాహాలు చేసుకున్న వారి మాదిరిగానే పౌర హక్కులు వర్తిస్తాయా? ఆస్తిపాస్తులు, వారసత్వం అనేవి పెద్ద సమస్యలు కాకపోవచ్చు.అయితే, స్వలింగ సంపర్కుల మధ్య వివాహం జరగడం వల్ల మతపరంగా, సాంస్కృతికంగా ఎదురయ్యే సమస్యల గురించి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇటువంటి వివాహాలకు మతపరంగా, సంస్కృతిపరంగా గుర్తింపు లభిస్తుందా అనేది ముఖ్యమైన సమస్యగా మారుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఇది మత విశ్వాసాలకు విరుద్ధమని, సామాజిక విలువలను కాలరాస్తుందని వాదించడం వల్ల ఉపయోగమేమీ లేదు. వ్యక్తి జీవితంలో వివాహమనేది ఒక శుభ కార్యమని, అందువల్ల దీన్ని అతి పవిత్రంగా ఉంచాల్సిన వ్యవహారమని అత్యధిక సంఖ్యాకుల అభిప్రాయమే కానీ, స్వలింగ సంపర్కుల వివాహాన్ని తక్కువగా చూడడానికి ఏమాత్రం వీలులేదు. దీన్ని కూడా ఒక సామాజిక, ఆర్థిక ఒప్పందంగానే పరిగణించాల్సి ఉంటుంది.
స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించడంలోనే దీనికి పరిష్కార మార్గం ఉంది. దీనికి న్యాయవ్యవస్థ ఆమోదం సరిపోతుందా లేక శాసన వ్యవస్థ ఆమోదం అవసరమవుతుందా అన్నదాని గురించే ఆలోచించాల్సి ఉంటుంది. మతాలన్నిటి వ్యక్తిగత చట్టాలకు, నియమ నిబంధనలకు అనుగుణంగా, వీటిని ప్రభావితం చేసే విధంగా వివాహ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావడానికి మాత్రమే శాసన వ్యవస్థ జోక్యం అవసరమవుతుంది. శాసన వ్యవస్థ అందుకు తగ్గ చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంది. లేని పక్షంలో న్యాయస్థానం జోక్యం చేసుకుని, జండర్‌తో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవచ్చా, కుటుంబాన్ని ఏర్పరచుకోవచ్చా అని నిర్ధారించడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. కొన్ని అతి ముఖ్యమైన, అతి కీలకమైన, అత్యవసరమైన సామాజిక అంశాల విషయంలో శాసన వ్యవస్థ నిష్క్రియాపరత్వం వల్లే న్యాయ వ్యవస్థ జోక్యానికి, వాటికి చట్టబద్ధత కల్పించడానికి అవకాశం లభిస్తుంటుంది.