ఛాంపియన్స్ ట్రోఫీ 2025 క్లైమాక్స్ కి చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక ఫైనల్ ఫైట్ దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9న) జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి జట్టు విజేతగా నిలుస్తుంది. ఇక ఇరుజట్లు ఫైనల్ ఫైట్ కి రెడీ అవుతున్నారు. ఈ టోర్నీలో రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఆత్మవిశ్వాసంతో ఫైనల్ కు చేరింది. మరోవైపు సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించి ఫైనల్ కు చేరింది.
ఇదిలా ఉంటే ఒకవేళ ఆదివారం జరగాల్సిన ఈ ఫైనల్ ఫైట్ వర్షం కారణంగా రద్దు అయితే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్న అభిమానుల తొలుస్తోంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పలు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇది పలు జట్ల సెమీస్ ఆశలపై నీళ్లు చల్లాయి. ఇదే క్రమంలో ఫైనల్ మ్యాచ్ సైతం వర్షం పడి రద్దు అయితే పరిస్థితి ఏంటి.. భారత్, న్యూజిలాండ్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఎవరిని ప్రకటిస్తారు అన్న ఆసక్తి నెలకొంది.

గ్రూప్ స్టేజ్ మ్యాచులకు రిజర్వ్ డే లు ప్రకటించని ఐసీసీ.. సెమీస్, ఫైనల్స్ కు మాత్రం రిజర్వ్ డే ప్రకటించింది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ వర్షం పడి ఆదివారం జరగకపోతే సోమవారం రోజు నిర్వహిస్తారు. ఆదివారం కొంత మ్యాచ్ జరిగిన తరువాత వర్షం పడి మిగిలిన మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేకపోతే.. సోమవారం రోజు ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలు పెడతారు. ఇక సోమవారం సైతం వర్షం పడి మ్యాచ్ నిర్వహించలేకపోతే.. అప్పుడు ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు.
2002లో భారత్, శ్రీలంక జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తలపడ్డాయి. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. ఇప్పుడు కూడా మ్యాచ్ రద్దైతే ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. అయితే గ్రూప్ స్టేజీలో వర్షం వల్ల రద్దైన మూడు మ్యాచ్‌లు పాకిస్థాన్ వేదికగానే జరిగాయి. ఫైనల్ దుబాయ్ వేదికగా జరగనుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు దాదాపుగా వర్షం ముప్పు లేదు. మ్యాచ్ సజావుగానే జరిగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ ఫైనల్ ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.