ప్రముఖ ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam). నంద్యాల జిల్లాలో కొలువైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు ఆలయంలో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తిగా సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివసేవకులు, భద్రతా సిబ్బంది సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు చేపట్టారు.
స్వామి వారికి వచ్చిన నగదు
ఈ మేరకు భక్తులు గత 16 రోజులుగా (ఫిబ్రవరి 17 నుండి మార్చి 4 వరకు) సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.5,69,55,455/-నగదు ఆదాయం నమోదు అయినట్లు ఆలయాధికారులు తెలిపారు.
బంగారం, వెండి, విదేశీ కరెన్సీ
మల్లన్న సన్నిధికి వచ్చిన భక్తులు హుండీలో నగదుతో పాటు 87 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం.5 కేజీల 850 గ్రాముల వెండిను సమర్పించారు. వివిధ దేశాల నుంచి వచ్చే భక్తులు తమ భక్తికి నిదర్శనంగా అమెరికా డాలర్లు-885, యూఏఈ దిర్హమ్స్-105, యూకే పౌండ్స్-80, సింగపూర్ డాలర్లు-2, కెనడా డాలర్లు-5 వంటి విదేశీ కరెన్సీలు సమర్పించారు.
శ్రీశైల మల్లిఖార్జునను దర్శించుకునేందుకు దేశ విదేశాలనుంచి లక్షలాది మంది భక్తులు నిత్యం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వామివారికి భక్తులు వేస్తున్న కానుకలు రికార్డు స్థాయిలో నమోదు కావడం విశేషమని ఆలయాధికారులు తెలిపారు.