వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు(Ram Gopal Varma) ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2019 సంవత్సరంలో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ మూవీపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
కాగా 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఆర్జీవీ ఓ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతోనే విడుదల చేశారంటూ బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఐడీ పోలీస్ స్టేషన్‌లో గతేడాది నవంబర్ 29న కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
దీంతో ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఎఫ్‌సీ ధ్రువపత్రం జారీ చేసిన తర్వాత 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదల చేశామన్నారు. 2024లో తనపై కేసు నమోదు చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఆర్జీవీపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తీర్పు వెలువరించింది.