వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టు (High Court)లో స్వల్ప ఊరట లభించింది. సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖ, చిత్తూరు జిల్లాల్లో తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులలో పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
కాగా వారం రోజుల క్రితం అన్నమయ్య జిల్లా పోలీసులు పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో మూడు రోజుల పాటు రాజంపేట సబ్‌జైలులో ఉన్నారు. ఆ తర్వాత నరసరావుపేట పోలీసులు పోసానిని పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. ఆ వెంటనే కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీసులు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అక్కడి కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి రక్షణ కల్పించేలా పోసాని హైకోర్టును ఆశ్రయించారు.