తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు(TG High Court) బిగ్ షాక్ ఇచ్చింది. వికారాబాద్ జిల్లాలోని సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల (Lagacharla), హకీంపేట్ (Hakimpet) గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
కాగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణకు 2024 నవంబర్ 30, డిసెంబర్ 1న రెండు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దుద్యాల మండలంలోని లగచర్ల , పోలేపల్లి , హకీంపేట్, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో 1,177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ (TGIIC) ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 643 ఎకరాలు పట్టా భూమి ఉంది.
భూ నిర్వాసితులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ (Pratik Jain) హామీ ఇచ్చారు. దీంతో వారంతా భూసేకరణకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల , పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే పూర్తి అయింది. అయితే రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు వచ్చిన కలెక్టర్‌తో పాటు అధికారులను రైతులు అడ్డుకున్న విషయం విధితమే. భూసేకరణపై అక్కడి రైతులు హైకోర్టును ఆశ్రయించగా తాజాగా నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.