తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్(Tamilisai) అరెస్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిభాషా విధానం తమిళనాడులో తీవ్ర రచ్చకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని అధికార డీఎంకే(DMK) తీవ్రంగా ఖండిస్తోంది. తమిళ భాషను చంపేందుకే హిందీ భాషను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మరోవైపు డీఎంకే నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ(BJP) రంగంలోకి దిగింది. తమిళనాడులో హిందీకి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది.
ఈ క్రమంలోనే చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌లో తమిళిసై సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు తమిళసై ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో డీఎంకే, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నిరసనలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా తమిళిసైను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.