ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్(Elon Musk) ఇప్పటికే అనేక రంగాల్లో పట్టు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంతరిక్ష రంగంపైనా పట్టు సాధించాలని తాపత్రాయపడుతున్నాడు. ఈమేరకు స్పేస్‌ఎక్స్(SpaceX) అనే సంస్థను స్థాపించి రాకెట్ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. తాజాగా ఆ కంపెనీ ప్రయోగించిన స్టార్‌షిప్ (Starship Rocket) మెగా రాకెట్ విఫలమైంది. దీంతో మస్క్‌కు గట్టి షాక్ తగిలింది.
టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. అయితే కొద్ది నిమిషాలకే అంతరిక్షంలో అది పేలిపోయింది. దాని శకలాలు భారీగా భూమి మీదకు దూసుకొచ్చాయి. మరోవైపు ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు తారాజువ్వల్లా కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీని కారణంగా మయామి, ఫోర్ట్ లాడర్‌డేల్, పామ్ బీచ్, ఓర్లాండో విమానాశ్రయాలలో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. రాకెట్ పేలిపోవడంపై స్పేస్‌ఎక్స్ (SpaceX) స్పందించింది. ఈ ప్రయోగాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడించింది. జనవరిలోనూ స్పేస్‌ఎక్స్ నిర్వహించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ విఫలమైంది. సాంకేతిక కారణాల వల్లే రాకెట్ పేలిపోయినట్లు ఆ సంస్థ పేర్కొంది.