తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), ఇతర రాష్ట్ర మంత్రులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఆర్‌ఆర్‌ఆర్ తదితర ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులపై నిధుల సాధనకు పార్లమెంట్‌లో రాష్ట్ర ఎంపీలు గళమెత్తే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.
ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది. ప్రజాభవన్‌లో రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్‌లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఇతర ఎంపీలకు భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇక ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.