కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. ఎన్నికల హామీలు అమలు చేయకుండా యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడుతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతిపై కూటమి సర్కార్ వెనకడుగు వేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈమేరకు యువత తరపున ప్రభుత్వంపై పోరాడేందుకు ‘యువత పోరు’ పేరిట కార్యాచరణ రూపొందించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ‘యువత పోరు'(Yuvatha Poru) పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 12వ తేదిన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడతామని తెలిపారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను బయటపెట్టేలా చేపట్టిన ‘యువత పోరు’ను విజయవంతం చేద్దాం అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.