మన దేశంలో పర్యటించి, ఇక్కడ అందమైన ప్రదేశాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకుందామని వచ్చిన ఓ ఇజ్రాయెల్ మహిళపై దారుణం జరిగింది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడ్డారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగు చూడటంతో దేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలోని హంపి సమీపంలోని సనపూర్ సరస్సు వద్ద ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్‌స్టే మేనేజర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు.
ఈ దాడిలో ఒడిశాకు చెందిన పర్యాటకుడు కాలువలో పడి మిస్సింగ్ అయ్యాడు. మరో ఇద్దరు పురుషులు గాయపడ్డారు. అమెరికా, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు పురుష పర్యాటకులు కూడా దుండగుల దాడిలోగాయపడ్డారు. వారి నుంచి ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం హంపి నుండి 4 కి.మీ దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.