ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోదని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తెలిపారు. ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ పాలనలో రూ. 7 లక్షల కోట్లు అప్పు అయిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)వెల్లడించారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా హరీశ్ కౌంటర్ ఇచ్చారు.
“అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంకెన్నాళ్లు అప్పుల పేరు చెప్పి తప్పించుకు తిరుగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోదు. తెలంగాణ అప్పు ఏడు లక్షల కోట్లు అని మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని అనేక సార్లు చెప్పాను. రాష్ట్ర అప్పు రూ. 4.17 లక్షల కోట్లు మాత్రమేనని అసెంబ్లీ వేదికగా ఆధారాలతో సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు వివరించాను. అయినా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మళ్ళీ అదే అబద్ధాన్ని చెబుతూ బీఆర్ఎస్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారు. దివ్యంగా ఉన్న రాష్ట్రం, దివాలా తీసిందని పరపతి, ప్రతిష్ట దిగజార్చుతున్నారు. అప్పులపై రేవంత్ రెడ్డి అబద్ధాలను, అవాస్తవాలను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని తెలిపారు.