ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) పోటీ చేసే కూటమి అభ్యర్థులు పేర్లు ఖరారయ్యాయి. ఇప్పటికే జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఓ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు(Somu Veerraju)ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మొత్తం ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.
టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర.. బీజేపీ నుంచి సోము వీర్రాజు కాసేపట్లో నామినేషన్లు వేయనున్నారు. ఈరోజుతో నామినేషన్లు గడువు ముగియనుంది. కాగా కూటమి పార్టీకి 164 ఎమ్మెల్యే సీట్లు ఉండటంతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనమండలిలో కూటమి సభ్యుల సంఖ్య పెరగనుంది.