తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLC Elections) అభ్యర్థులను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి శంకర్ నాయక్, విజయశాంతి, అద్దంకి దయాకర్ పేర్లు ఖరారయ్యాయి. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్(Addanki Dayakar), బీఆర్ఎస్ నుంచి శ్రవణ్(Dasoju Shravan)కు ఎమ్మెల్సీ స్థానాలు దక్కడంపై డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి(Ghanta Chakrapani) సంతోషం వ్యక్తం చేశారు.
‘నా ఇద్దరు మిత్రులు, ఒక రకంగా ఆత్మీయ సోదరులు అద్దంకి దయాకర్, దాసోజు శ్రావణ్. ఆయా పార్టీల నుంచి శాసన మండలికి ఎంపికయ్యారు. ఇద్దరికీ అభినందనలు. శుభాకాంక్షలు. శ్రావణ్ అటు ఇటుగా ఉస్మానియాలో ఒకే బ్యాచ్. ఆయన రైట్ వింగ్ లీడర్, మేం లెఫ్ట్. అయినా మేమిద్దరం మంచి మిత్రులం. ఇక దయాకర్ తెలంగాణ ఉద్యమంతో పరిచయం. నాకు ప్రత్యేక అభిమానం. ఇద్దరిదీ ఒకే కథ. విద్యాధికులు, బోల్డ్, డైనమిక్. సామాజిక స్పృహ ఉన్నవాళ్లు. అయినా అవకాశాలు రాని నాయకులు. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు. ఈ ఇద్దరినీ ఎంపిక చేసినందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకత్వాలకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.