మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ..చంద్రబాబు(Chandrababu) ముఖ్యమంత్రి అయ్యారంటే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వల్లనేనంటూ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే కేవలం జనసేన పార్టీ వల్లనేనని బాంబ్ పేల్చారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని తెలిపారు. ఇక టీడీపీ నేత వర్మ చాలా సీనియర్ రాజకీయ నాయకుడని కొనియాడారు.
ఆయన విషయంలో టీడీపీ నిర్ణయం తీసుకుంటుందని.. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయనను గౌరవించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇక పవన్ భద్రత విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్‌తో పాటు పార్టీ పరంగా కూడా భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. మార్చి 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణంలో నలువైపులా 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని నాదెండ్ల పేర్కొన్నారు.