అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని విజయశాంతి(Vijayashanti) తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో పని చేశానని కానీ ఏనాడూ ఇది కావాలని అడగలేదని అన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు గతంలో అవకాశం ఇచ్చినా.. ముందు పనిచేస్తానని తర్వాత పదవి తీసుకుంటానని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
పార్టీ అధిష్ఠానం ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ఎవరికి, ఎప్పుడు ఏ బాధ్యత ఇవ్వాలో అప్పుడే ఇచ్చి పని చేయించుకుంటుందన్నారు. పార్టీలో ఉండి పదవులు రాని వారు కాస్త ఓపిక పట్టాలని సూచించారు. అవకాశం కోసం ఎదురు చూశానని ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉంటుందని దాని ప్రకారమే అందరూ పని చేయాలని చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీ- బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ నాయకులు తనను పార్టీలోకి ఆహ్వానించారని.. కానీ లోపల మాత్రం బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అది నచ్చకే బీజేపీ నుంచి బయటకి వచ్చినట్టు ఆమె వెల్లడించారు.