2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు వెలువరించిన(Pranay Murder Case) తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రణయ్ హత్యతో తాము చాలా కోల్పోయామన్నారు. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. కుల దురహంకారంతో కూతుళ్లను చంపుకునే వారికి ఈ తీర్పు కనువిప్పు కావాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ప్రణయ్ హత్యతో తమకు కొడుకు లేకుండా, అమృతకు భర్త లేకుండా పోయాడని వాపోయారు. అలాగే అమృత తండ్రి మారుతిరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు.ఏదైనా సమస్య ఉంటే చర్చించుకొని పరిష్కరించుకోవాలి కానీ హత్యలు సరికాదని అన్నారు. ఈ కేసులో న్యాయం జరగడానికి నాటి ఎస్పీ రంగనాథ్ కూడా సహకరించారని పేర్కొన్నారు. న్యాయం జరిగినా కానీ తన కొడుకులేని లోటును ఎవరూ తీర్చలేరని కంటతడి పెట్టారు.
ఇక అమృత బాబాయ్ శ్రవణ్ రావుకు జీవితఖైదు పడటంతో ఆయన భార్య, కుమార్తె కోర్టులోనే భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఏ తప్పు చేయలేదని.. పోలీసులు తెల్ల పేపర్‌పై ఆయన సంతకం పెట్టించుకున్నారని ఆరోపించారు. అమృత చేసిన తప్పు వల్ల అందరం బాధపడుతున్నామన్నారు.