ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100 శాతం నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు(Chandra Babu) అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలుచేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష చేశారు. వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సమీక్షించారు. ప్రతివారం నాలుగు శాఖలపై సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు…ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మునిసిపల్ శాఖలోని సేవల్లో వచ్చిన రిపోర్టులపై సమీక్ష చేశారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని అదేశాలు ఇచ్చారు. కరెప్షన్ అనేది ఒక జబ్బులాంటిదని, దీన్ని పూర్తిగా నివారించాల్సిందే అని సీఎం అన్నారు.
మెరుగుపడ్డ ఆసుపత్రి సేవలు
ఆసుపత్రుల్లో అందించే సేవలపై రోగుల నుంచి ప్రభుత్వం అభిప్రాయం సేకరించింది. డాక్టర్‌లు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నారా అన్న ప్రశ్నకు 68.6 శాతంమంది ఉంటున్నారని సమాధానమిచ్చారు. డాక్టర్ల ప్రవర్తనపై 71.7 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 65.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్‌లు రాసిచ్చిన మందులు ఆసుపత్రిలో ఇస్తున్నారా, ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత ఎలా ఉంది అన్న ప్రశ్నల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంది. ఈ విభాగంలో 65 శాతం వరకు సంతృప్తి వ్యక్తం అవ్వగా..దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలి సీఎం సూచించారు. గత నివేదికలతో పోల్చుకుంటే సేవలు కొంత మెరుగుపడినట్లు చెప్పారు.
చెత్త సేకరణ
అదే విధంగా మున్సిపల్ సేవల నుంచి కూడా అభిప్రాయం తీసుకున్నారు. మీ నుంచి రోజూ చెత్త సేకరిస్తున్నారా, మీ పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలను 24 గంటల్లోపు తొలగిస్తున్నారా అనే అంశాలపై సమాచారం సేకరించారు. ఈ విషయంలో 67 శాతంమంది అవును అని చెప్పారు. పలు ప్రాంతాల్లో సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఉన్నాయని..వాటిని పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
రెవెన్యూ సేవలు
రెవెన్యూ సేవలకు సంబంధించి మీ పాసు పుస్తకం దరఖాస్తుపై రుసుము కాకుండా ఏవైనా అదనపు ఛార్జీలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అవును అని 24.95 శాతం మంది, మీ అర్జీ గురించి గ్రామ రెవెన్యూ అధికారి విచారణ కొరకు నోటీసు ఇచ్చారా అన్న ప్రశ్నకు ఇచ్చారు అని 40.61 శాతం మంది, మీ అర్జీ గురించి గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారా అన్న ప్రశ్నకు 63.33 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు. అదే విధంగా మీ సర్వే దరఖాస్తుపై దరఖాస్తు రుసుము కాకుండా అదనపు ఛార్జీలు తీసుకున్నారా అన్న ప్రశ్నకు 22.04 శాతం మంది అవును అని, మీ భూమి సర్వే చేయుటకు మీకు విచారణ తేదీ, సమయం తెలుపుతూ నోటీసు జారీ చేశారా అన్న ప్రశ్నకు అవును అని 59.80 శాతం మంది, మీకు ఇచ్చిన నోటీసు ప్రకారం సర్వేయర్ మీ భూమిని సర్వే చేశారా అన్న ప్రశ్నకు అవును అని 56.51 శాతంమంది సమాధానం ఇచ్చారు. రెవెన్యూ సేవల్లో మార్పు కనిపించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ విభాగంలో మార్పు చూపిస్తే ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతుందని…ఆ మేరకు అధికారులు పనిచేయాలని సీఎం అన్నారు.
భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
దేవాలయాల్లో దర్శనం, వసతులు, పరిశుభ్రత, వంటి వివిధ అంశాలపై భక్తుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తెలుసుకుంది. దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా అన్న ప్రశ్నకు 70 శాతం మంది అవును అని, దేవాలయాల్లో మౌలిక వసుతుల, తాగునీరు, వాష్ రూమ్‌లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలపై 63 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా అన్న ప్రశ్నకు 81 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…దేవాలయాల్లో భక్తుల పట్ల మర్యాదగా, సౌమ్యంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. దేవాలయాల్లో దేవుని సేవకు వాలంటీర్ల విధానాన్ని అమలు చేయాలని….క్యూలైన్ల నిర్వహణతో పాలు పలు సేవల్లో పనిచేసేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని…స్వచ్ఛందంగా వచ్చే వారిని సేవలకు ఉపయోగించుకోవాలని సూచించారు. దేవునిసేవలో పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు…వారికి సరైన శిక్షణ, అవగాహన కల్పించి దేవాలయ సేవలకు వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా పూజలు, జాతరలు జరుగుతాయని…. వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం అన్నారు. జాతరలు, ఇతర వేడుకల సందర్భాల్లో అందరికీ వసతి ఇవ్వలేని సమయంలో టెంట్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
వర్క్ ఫ్రం హోంపై సర్వే
రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్క్ ఫ్రం హోంతో పాటు నైబర్ హుడ్ వర్కింగ్, కో వర్కింగ్ విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటి నుంచే పని విధానంలో వసతులు, అవకాశాలు కల్పించడం, శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రం హోంపై సర్వే నిర్వహిస్తున్నారు. 2.68 కోట్ల మందిని సర్వే చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 82.06 లక్షల మందిని సర్వే చేశారు. వీరిలో 1.72 లక్షల మంది వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నట్లు వివరించారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నా..తమకు తగిన అవకాశాలు లేవని…అటువంటి ఉపాధి కల్పిస్తే తాము కూడా వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తామని 20.43 లక్షల మంది తెలిపారు. సర్వే చేసిన వారిలో ఇంటర్ కంటే తక్కువ చదివిన వారు 9.05 లక్షల మంది ఉండగా, డిప్లొమా, ఆపై చదువులు చదివిన వారు 10.73 లక్షల మంది ఉన్నారు. ఆయా గ్రామాల్లో వర్క్ ఫ్రం హోం సెంటర్లు, పని స్టేషన్ సెంటర్‌ల ఏర్పాటుకు ఉన్న భవనాలపైనా సర్వే నిర్వహిస్తున్నారు.
విద్యార్హతలు ఉండి, పని చేసే సామర్థం ఉన్నవారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని సీఎం అధికారులకు సూచించారు. అనంతరం మనమిత్ర ద్వారా అందుతున్న వాట్సాప్ సర్వీసులపైనా సీఎం సమీక్ష చేశారు. ప్రస్తుతం 200 రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందుతున్నాయని అధికారులు వివరించారు. డిజిటల్ లిటరసీ ట్రైనింగ్ జరగాలని, అన్ని సేవలు ఆన్లైన్‌లో ఇస్తున్నారనే సమాచారం ప్రజలకు చేరాలని సీఎం అన్నారు. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని, అవినీతిని నివారించవచ్చని సీఎం అన్నారు. డ్రోన్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునే విధానంపైనా అధికారులు దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. పోలీసు విభాగంలో రాత్రి గస్తీ విధుల్లో సిబ్బందిని తగ్గించి డ్రోన్ ద్వారా పర్యవేక్షించే పరిస్థితి రావాలన్నారు. అదే విధంగా పారిశుధ్య పనుల్లో కూడా డ్రోన్ వాడకాన్ని మెరుగుపరచాలని సూచించారు. టెక్నాలజీ సాయంతో ఎఫెక్టివ్‌గా పనిచేసి మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నప్పుడు వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం అన్నారు.