ఏపీ రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి తీసుకునే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ఇప్పటివరకు ప్రత్యేక సాయం, గ్రాంట్స్ కింద ఏపీకి రూ.2,500 కోట్లు ఇచ్చామన్నారు. అమరావతి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణ ఆమోదం కోసం సాయం చేశామని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయన్నారు. అయితే ఈ రుణాలకు సంబంధించిన పంపిణీ ఇంకా జరగలేదని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే అమరావతిలో 13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్వంలో అమరావతి సచివాలయలో భేటీ అయిన ఈ కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో మొత్తం 44 సంస్థలకు 2014-19 సమయంలో భూములు కేటాయించినట్లు తెలిపింది. అయితే ఇందులో 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. మరో 13 సంస్థలకు మాత్రం కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.