తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) ప్రధాని మోదీని(PM Modi) కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో కుటుంబసమేతంగా మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటల పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ పెద్దల ఆశీర్వాదం కోసం ఫ్యామిలీతో కలిసి వెళ్లారని సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావుతో పాటు పలువురు నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం మాత్రం బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల వైపే మొగ్గు చూపిన్నట్లు కాషాయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందంటున్నారు.
కాగా పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలవడంతో పాటు ఇటీవల జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.