బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్‌కు ఎమ్మెల్సీ టికెట్ దక్కిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అలకబూనారని.. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై ఆర్ఎస్పీ తీవ్రంగా స్పందించారు.
“నా రాజకీయ భవిష్యత్తుపై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ చిల్లర వేషాలను కాంగ్రెస్ నేతలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో.. ఏ వర్గాల భవిష్యత్తు కోసం పని చేయాలో నాకు క్లారిటీ ఉంది. మీలాగా పదవుల కోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి నాకు లేదు. అన్ని పైసలు కూడా నా దగ్గర లేవు.
తెలంగాణలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గాల విముక్తికి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీసరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నాను. రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ప్రోత్సాహంతో తెలంగాణ 2.0ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నాను” అని క్లారిటీ ఇచ్చారు.