తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలపై కర్ణాటక అసెంబ్లీలో(Karnataka Assembly) చర్చ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం తమ గ్యారంటీల అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులుగా కాంగ్రెస్ కార్యకర్తలను నియమించి వారికీ కేబినెట్ హోదా కల్పించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ఈ సందర్భంగా విపక్ష నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
గ్యారంటీల హామీల అమలు ఎంత కష్టమో మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా తెలిపారన్నారు. ఏటా రూ.18వేల కోట్లు పింఛన్లు, వేతనాలకు చెల్లిస్తూ గ్యారంటీల వ్యయాన్ని మోయటం భారమని ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. గ్యారంటీల అమలు కష్టమని మీ సొంత సీఎం అభిప్రాయపడుతుంటే, మీ ప్రభుత్వం మాత్రం కార్యకర్తలకు గ్యారంటీ అమలు పేరిట 5ఏళ్లలో రూ.50కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం అయ్యారని తీవ్రంగా విమర్శించారు. మరో బీజేపీ సభ్యుడు ఎం.సతీశ్‌రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం పథకాల అమలుకు విచ్చలవిడిగా ఖర్చుచేసిందని తెలిపారు. అయితే విపక్ష సభ్యుల విమర్శలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బదులిచ్చారు. పథకాలను లబ్ధిదారులకు చేర్చేందుకు పార్టీ కార్యకర్తలు సహకరిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.