ఏపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) ఆధ్వర్యంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా అయ్యన్న ట్వీట్ చేశారు. నిత్యం ప్రజాసేవలో తలమునకలయ్యే రాజకీయ నేతలకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీలు మార్చి 18 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలు ప్రజాప్రతినిధులకు రిలీఫ్ కలిగించడంలో ఎంతో సహాయపడతాయన్నారు.
అందుకే ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఎమ్మెల్యేలందరినీ కోరానని వెల్లడించారు. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించానని పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని అయ్యన్న వివరించారు.
