వైసీపీ(YCP) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుంది. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు.. గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. కన్నుమూసి తెరిచే లోపు ఏడాది గడిచింది.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనే. గత వైసీపీ పాలనలో అన్నీ వర్గాలను అక్కున చేర్చుకున్నాం. వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి ఇవాళ యాదృచ్చికంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయి’ అని అన్నారు.


“నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు” అని ట్వీట్ కూడా చేశారు.
