వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)కి ఏపీ హైకోర్టులో(AP High Court) భారీ ఊరట లభించింది. విశాఖలో తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండాలని సూచించింది.
కాగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కొడాలి నాని.. అప్పటి ప్రతిపక్ష నేతచంద్రబాబు(Chandrababu), యువ నేత నారా లోకేశ్(Nara Lokesh)పై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వంలో నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ కార్యకర్తలు వరుసగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషల్‌లో ఏయూ కాలేజీ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కొడాలిపై కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసులో తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించడంతో నానికి ఊరట దక్కింది.