తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ అసెంబ్లీ వేదికగా తల్లికి వందనం పథకం(Talliki Vandhanam)అమలుపై సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక ప్రకటన చేశారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం వర్తిస్తుందని హామీ ఇచ్చారు. ఐదుగురు పిల్లలున్నా సరే ఒక్కొక్కరికి రూ. 15వేలు తల్లి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఎక్కువ మంది పిల్లలను కన్నాలని సూచించారు. ఎంతమంది పిల్లలకైనా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. సిజేరియన్ ఆపరేషన్లను నియంత్రించాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు సూచించారు. ఆడబిడ్డలకు న్యాయం చేసిందే టీడీపీ ప్రభుత్వంలో అన్నారు. ఆస్తిలో వాటా, డ్యాక్రా సంఘాలు, దీపం పథకం, అంగన్వాడీలు ఇలా ఎన్నో పథకాలను తమ హయాంలో ప్రవేశపెట్టామన్నారు.
అంతకుముందు మంత్రి నారా లోకేశ్ కూడా తల్లికి వందనం పథకంపై స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఊరటనిస్తామని వెల్లడించారు.