తెలంగాణ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన గద్దర్ అవార్డుల(Gaddar Awards) ప్రదానోత్సవం ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్టు TFDC ఛైర్మన్ దిల్ రాజు(Dil Raju) తెలిపారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం, ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విధివిధానాలు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సీఎంతో దిల్ రాజు భేటీ అయ్యారు. తాజాగా ఆ వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉమ్మడి ఏపీలో నంది అవార్డులు ఇచ్చేవారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అవార్డుల కార్యక్రమం జరగలేదన్నారు. దీంతో 2014 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాదికి సంబంధించిన ఉత్తమ చిత్రానికి అవార్డు ఇస్తామని తెలిపారు.
అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ప్రముఖ నటులు ఎం. ప్రభాకర్ రెడ్డి పేరుపై అవార్డును కొనసాగిస్తామన్నారు. ఫీచర్ ఫిలిం కేటగిరిలో మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ హబ్‌గా మార్చడానికి సినిమా రంగాన్ని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు