తెలంగాణలోని ఇంటర్ కాలేజీలను గొప్పగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ బాధ్యత లెక్చరర్ల మీదే ఉందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కొత్తగా ఉద్యోగాలు పొందిన 1292 మంది జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని రేవంత్ తెలిపారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైందని, కానీ తాము మాత్రం 55 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేశామని రేవంత్ పేర్కొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు ప్రైవేట్ పాఠశాలలకు గొప్పగా తయారవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నమెంట్ స్కూల్, కాలేజీ విద్యార్థులు ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో పోటీ పడలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గవర్నమెంట్ లెక్చరర్లకే ఎక్కువ నాలెడ్జ్ ఉందని, అయినా రిజల్ట్ వారికంటే తక్కువ రావడంపై శ్రద్ధ పెట్టాలన్నారు.
ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను తీర్చిదిద్దాలని చెప్పుకొచ్చారు. ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబ భవిష్యత్తు మారిపోతుందని రేవంత్ పేర్కొన్నారు. కుటుంబ కష్టాలు తొలగిపోతాయని వివరించారు. తెలంగాణలో త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని, తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.