కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన బండి సంజయ్(Bandi Sanjay) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వాగ్దాటితో ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. తాజాగా తన మాటలతోనే కాదు తన గాత్రంతోనూ మెప్పించగలగను అని నిరూపించారు. ఏకంగా ప్రధాని మోదీ(PM Modi)పై ఓ పాట పాడారు. ఏడాది క్రితం రిలీజ్ అయిన ‘నమో.. నమో.. నరేంద్ర మోడీ’ పాటను ఓ రికార్డ్ స్టూడియోలో హుషారుగా పాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది సార్వత్రిక ఎన్నికలకు ముందు పాడిన పాట అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా బండి సంజయ్ సింగర్ అవతారం ఎత్తడం ఇదే కొత్త కాదు. కేంద్ర మంత్రి అయ్యాక హున్నాబాద్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమలో పాల్గొన్న ఆయన తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఓ పాట పాడారు. ‘ఈ భూమి బిడ్డలం హిందువులం అందరం..’ అనే పాటను పాడి వినిపించి అందరిని ఆకట్టుకున్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండి సంజయ్ ఇటీవల పార్టీ పెద్దలు తనకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తిచేశారు. ఉమ్మడి కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి తన సత్తా ఏంటో నిరూపించారు.