ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతి(Amaravati)ని కాదని మూడు రాజధానుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో అమరావతి రైతులు, మహిళలు నాలుగు సంవత్సరాల పాటు నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో వారు అనేక అవమానాలతో పాటు లాఠీ దెబ్బలు, పోలీసుల కేసులు ఎదుర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతోంది.
తాజాగా అమరావతి రైతులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu)కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రాంత రైతుల వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రైతు బిడ్డగా అండగా నిలిచానని.. కేసులు పెట్టినా వెనుకడుగు వేయలేదన్నారు. అమరావతి లాంటి ఉద్యమం ఇప్పటి వరకు చూడలేదన్నారు. రాజధాని రైతులు, మహిళల కన్నీరులో వైసీపీ కొట్టుకుపోయిందని తెలిపారు. ఉద్యమం విజయవంతం అయినందుకు శ్రీనివాసుని కల్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న జరిగే ఈ కార్యక్రమంలో రైతులంతా పాల్గొనాలని కోరారు.