జనసేన(Janaseana) 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు సీఎం చంద్రబాబు(Chandrababu), మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశారు.
“జనసేవా నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ ముఖ్య నాయకులకు, జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు” అని చంద్రబాబు తెలిపారు.
‘‘జనసేన 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా పవన్ కల్యాణ్ అన్నకు అభినందనలు. జనసేన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏపీ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయం. రాష్ట్ర పురోగతి, శ్రేయస్సులో జనసేనపాత్ర అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుంది’’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
కాగా కాసేపట్లో జనసేన ఆవిర్భావ దినోత్సవం బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి పిఠాపురం చేరుకున్నారు. సభా ప్రాంగణంలో ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు. అధికారంలోకి వచ్చాక నిర్వహించనున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి జనసైనికులు, వీరమహిళలు భారీగా పోటెత్తారు.