దానాలలో అవయవ దానం గొప్పదని అంటారు. ఎందుకంటే మనం దానం చేసిన అవయవాలతో ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు. సాధారణంగా మరణించిన వ్యక్తుల శరీరం నుండి కొన్ని అవయవాలు సేకరించి, అవసరమైన వారికి అమరుస్తారు. ముఖ్యంగా మెదడు చనిపోయిన వ్యక్తుల (బ్రెయిన్ డెడ్) అవయవాలు కూడా దానం చేయడం చాలా అవసరం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జీవించి ఉన్న వ్యక్తులు సైతం కొన్ని అవయవాలు దానం చేయవచ్చు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుండి అవయవ దానం ఎలా చేస్తారనేది చాలా మందికి సందేహం. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది, శస్త్రచికిత్స ఎలా చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత, జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్ (ZTCC) నిబంధనల ప్రకారం, వైద్యులు మొదట బ్రెయిన్ డెత్‌ని నిర్ధారిస్తారు. తర్వాత దాత అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయా, మార్పిడికి అనుకూలంగా ఉన్నాయా అని పరీక్షిస్తారు. బ్లడ్ గ్రూప్, కణజాలం అనుకూలత, వైద్య అత్యవసరాల ఆధారంగా దాత అవయవాలు రోగికి సరిపోతాయా లేదా అని నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ అంతా చట్టబద్ధంగా జరుగుతుంది. ఎవరికి అవయవాలు అమరుస్తున్నారనేది దాత కుటుంబానికి చెప్పరు. అయితే దానం చేసిన అవయవాల పనితీరు, అవయవాలు పొందిన వ్యక్తి ఆరోగ్యం గురించి వారికి సమాచారం అందిస్తారు.
అవయవాలు సరిపోతే, వాటిని సేకరించడానికి సుమారు 3-4 గంటల పాటు శస్త్రచికిత్స చేస్తారు. అవయవాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా తీసి, ప్రత్యేక ద్రావణంలో భద్రపరుస్తారు. ఒకే దాత ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చు. రెండు కిడ్నీలు ఇద్దరి ప్రాణాలను రక్షిస్తాయి. కాలేయాన్ని విభజించి ఇద్దరికి అమర్చవచ్చు. గుండె, ఊపిరితిత్తులు, క్లోమం కూడా మార్పిడి చేయవచ్చు. కార్నియాలు ఇద్దరికి చూపునిస్తాయి. చర్మం, ఎముకలు, స్నాయువులు కాలిన గాయాలు లేదా ఇతర వైద్య అవసరాలకు ఉపయోగపడతాయి.
అవయవ దానం ప్రక్రియ అంతటా దాత శరీరాన్ని గౌరవంగా చూస్తారు. శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియా ఇస్తారు. ఆసుపత్రి సిబ్బంది దాత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటారు. అవయవాలు తీసిన తర్వాత శరీరాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.