జనసేన పార్టీ పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం.. చిత్రాడలో ‘జయకేతనం’ సభ ఘనంగా జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జరిగిన ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం జనసేన జెండాలతో కళకళలాడింది. ఈ సందర్భంగా జనసేన 12 సంవత్సరాల ప్రస్థానాన్ని చాటేలా ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ప్రజల సమస్యలపై పవన్ కల్యాణ్ చేసిన పోరాటం, ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీ ద్వారా వివరించారు.
ఇక ఈ సభలో ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ.. నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు సమాధానం చెప్పేలా మాట్లాడాలని అన్నారు. నోటి దురుసుతో వ్యవహరించిన ఒక నేతకు చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నాగబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. జగన్ కళ్లు మూసి తెరిచేలోపే తొమ్మిది నెలలు గడిచిపోయాయని, ఇప్పుడు మళ్ళీ కళ్లు మూసి తెరిస్తే ఐదేళ్లు గడిచిపోతాయని.. అధికారం మాదే అంటున్నారని.. ఇది హాస్యం కాదా అని ప్రశ్నించారు.
ప్రజల కోసం పని చేయకుండా అభివృద్ధిని పక్కన పెట్టి, అహంకారంతో వ్యవహరించే నేతలకు భవిష్యత్తులో చోటు ఉండదని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడే గొప్ప నాయకుడని, స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజా సంక్షేమమే లక్ష్యమని అన్నారు. పవన్ కల్యాణ్ ఆలోచనలు కేవలం ఇప్పటి కోసం కాదని, రాబోయే తరాల భవిష్యత్ కోసం ఆయన పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఓపిక, పట్టుదల, సేవా భావం ఉండాలని, ఈ మూడు గుణాలు పవన్ కల్యాణ్‌లో ఉన్నాయని అన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన గెలుపు, జనసైనికుల గెలుపు అని నాగబాబు స్పష్టం చేశారు.