జనసేన ప్రశ్నలు అడిగే పార్టీ నుంచి.. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపే పార్టీగా ఎదిగిందని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన ఎప్పుడూ విలువలకు కట్టుబడిన రాజకీయాలు చేస్తుందని, అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతాల నుంచి తప్పుకోదని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రయాణంలో అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొందని ఆయన గుర్తు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికే ఉపయోగపడేలా ఎదగాలని తాము కోరుకుంటున్నామని నాదెండ్ల అన్నారు. అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు పవన్ వారికి అండగా నిలబడ్డారని, రైతులు, మహిళలు రాజధాని కోసం పోరాడుతుంటే వారి తరపున ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్ర పెద్దలతో చర్చించారని ఆయన గుర్తు చేశారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారని ఆయన అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన 5 రోజులకే పవన్ ఢిల్లీ వెళ్లారని, పార్లమెంట్ వద్దకు వెళ్లి అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని, దాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని గట్టిగా చెప్పారని నాదెండ్ల తెలిపారు.
2019 ఎన్నికల సమయంలో జనసేన ఉనికిపై ప్రశ్నలు వస్తున్న సమయంలోనూ భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం చేశామని, పవన్ పిలుపుతో వారం రోజులపాటు నిర్మాణ రంగం కార్మికులకు జనసైనికులు ఆహారం అందించారని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలోనూ ఎంతోమందికి జనసేన అండగా నిలిచిందని, రైతుల కోసం మండపేట, కాడినాడలో దీక్షలు చేసిన విషయాన్నీ నాదెండ్ల గుర్తు చేసుకున్నారు. జనసేన, పవన్ కల్యాణ్ ప్రస్థానం సామాన్యమైంది కాదని, ప్రతి అడుగులోనూ అనుమానాలు, అవమానాలు ఎదుర్కొన్నామని, రాష్ట్రం, దేశం కోసం పని చేయాలంటూ కార్యకర్తలు, నాయకులను పవన్ కల్యాణ్ నడిపిస్తున్నారని ఆయన అన్నారు.
ఒక సీటు కోసమో, పదవి కోసమో పవన్ ఎప్పుడూ పని చేయలేదని, కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపై మరింత బాధ్యత పెరిగిందని నాదెండ్ల అన్నారు. ‘వై నాట్ 175’ అన్న వారికి ప్రజలు, జనసేన కార్యకర్తలు సరైన సమయంలో బుద్ధి చెప్పారని ఆయన చెప్పారు.