11 ఏళ్ల జనసేన.. వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసిందని.. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “జనసేన జన్మస్థలం తెలంగాణ.. కానీ కర్మస్థానం ఆంధ్రప్రదేశ్” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తాను చిన్నప్పుడు కరెంట్ షాక్‌కు గురై ప్రాణాపాయం ఎదుర్కొన్న సమయంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాను అని పవన్ గుర్తు చేశారు. గద్దర్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసిన పవన్, దాశరథి కృష్ణమాచార్యులను కూడా గుర్తుచేశారు. దాశరథి సాహిత్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, “రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా..” అనే మాటలను నిజం చేశామని తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇక జనసేన ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని పవన్ పేర్కొన్నారు. 2019లో మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు. జనసేన కార్యకర్తలను వేధించారని.. ఆడపడుచులను అవమానించారని పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైళ్లలో వేశారని పేర్కొన్నారు. నాడు అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ చేశారని.. కానీ 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టామన్నారు. దేశం మొత్తం మన వైపే చూస్తోందని… 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచాం. భయం లేకపోవడమే మన బలం.. ధైర్యమే మన కవచం” అని పవన్ కల్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
దేశంలో జరుగుతున్న భాషా వివాదంపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. “బహు భాషలే భారతదేశానికి మంచివి” అని పేర్కొన్న ఆయన, తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడుతో పాటు భారతదేశానికి మల్టిపుల్ లాంగ్వేజెస్ కావాలని.. ఇది పరస్పరం అర్థం చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. హిందీని తమిళనాడు వ్యతిరేకించడం పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అలా అయితే తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి.. నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి గానీ.. భాషలు వద్దా అని ప్రశ్నించారు. పనివాళ్లు బీహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా అని పవన్ ప్రశ్నించారు.