హిందీ భాషపై తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ తెలిపారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై జనసైనికులు మండిపడుతున్నారు.
కాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగిస్తూ ‘మాట్లాడితే దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు. అన్నీ దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దు వద్దు అంటుంటే నా మనసులో ఒకటే అనిపిస్తుంది. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గఢ్ నుంచి డబ్బులు కావాలి.. పనిచేసే వాళ్లు అందరూ బీహార్ నుంచి కావాలి కానీ హిందీని ద్వేషిస్తాం అంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు’ అని పవన్ పేర్కొన్నారు.