ప్రస్తుతం వాహనాల వినియోగం ఎక్కువైంది.. పల్లెటూళ్లలో కూడా బైక్‌లు, కార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి చోట పెట్రోల్ బంకులు పెడుతున్నారు. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ అవకాశాన్ని వాడుకుని మోసాలు చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో జరిగే కొత్త మోసాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
చాలా మంది పెట్రోల్ బంకుల్లో మోసపోతుంటారు. పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టేటప్పుడు “జీరో చూసుకోండి” అని అంటారు. అయితే జీరో ఉన్నంత మాత్రాన మనల్ని మోసం చేయలేరనుకుంటే పొరపాటు. కొన్ని పెట్రోల్ బంకుల్లో “జంప్ ట్రిక్” అనే మోసం చేస్తున్నారు.
పెట్రోల్ పోయడం మొదలు పెట్టగానే మీటర్ నెమ్మదిగా పెరగకుండా, ఒక్కసారిగా 10 లేదా 20 పాయింట్లు పెరుగుతుంది. దీని వల్ల మనకి తక్కువ పెట్రోల్ పోసినా, మీటర్ లో ఎక్కువ చూపిస్తుంది. సాధారణంగా మీటర్ 4-5 పాయింట్లు మాత్రమే జంప్ అవ్వాలి. ఒకవేళ మీటర్ ఒక్కసారిగా 10 లేదా 20 పాయింట్లు జంప్ అయితే వెంటనే అనుమానించాలి.
మరో మోసం ఏంటంటే, కొన్ని పెట్రోల్ బంకుల్లో మీటర్ రీడింగ్‌ని తారుమారు చేసే చిప్స్‌ని అమరుస్తారు. ఈ చిప్ వల్ల మీటర్ చూపించే దానికంటే తక్కువ పెట్రోల్ మనకి వస్తుంది. ఉదాహరణకు 100 రూపాయల పెట్రోల్ అడిగితే ఈ చిప్ వల్ల 97 రూపాయల పెట్రోల్ మాత్రమే మనకి వస్తుంది.
ఏదైనా మోసం జరిగితే, పెట్రోల్ బంకులో ఉండే కంప్లైంట్ బుక్‌లో ఫిర్యాదు చేయాలి. అక్కడ పనిచేసే వాళ్ళు ఫిర్యాదు చేయొద్దని చెప్పినా వినకండి. లేదా ఆయిల్ కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు.