జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా పవన్ వ్యాఖ్యలపై డీఎంకే(DMK) ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందించారు. భాషా విధానం, విద్యలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను ప్రోత్సహించేందుకు డీఎంకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జాతీయ విద్యా విధానం(NEP) ద్వారా కేంద్రం హిందీని ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. దీన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. హిందీని స్వేచ్ఛగా నేర్చుకోవాలనుకునే వారికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమిళనాడు భాషా విధానంపై పవన్ కల్యాణ్‌కు సరైన అవగాహన లేనట్లు ఉందన్నారు.
సీనియర్ డీఎంకే నాయకుడు టికెఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ.. తమిళనాడు భాషా విధానం చాలా కాలంగా స్థిరంగా ఉందని చెప్పారు. 1938 నుంచే తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతోందని గుర్తుచేశారు. 1968లోనే తమిళనాడు అసెంబ్లీలో ద్విభాషా విధానం బిల్లు పాస్ అయ్యి అమలులోకి వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ అప్పటికీ జన్మించలేదని తెలిపారు.
కాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగిస్తూ ‘మాట్లాడితే దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు. అన్నీ దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దు వద్దు అంటుంటే నా మనసులో ఒకటే అనిపిస్తుంది. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గఢ్ నుంచి డబ్బులు కావాలి.. పనిచేసే వాళ్లు అందరూ బీహార్ నుంచి కావాలి కానీ హిందీని ద్వేషిస్తాం అంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు’ అని పవన్ పేర్కొన్నారు.